‘సూపర్ స్టార్ వద్దు.. అభిమానుల ప్రేమ చాలు’

‘సూపర్ స్టార్ వద్దు.. అభిమానుల ప్రేమ చాలు’

సూపర్ స్టార్ మహేష్ బాబు- ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ ‘స్పైడర్’. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం చెన్నైలోని కలైవానర్ ఆరంగం వేదికపై జరిగింది. ఈ చిత్రాన్ని తమిళ్, తెలుగు భాషల్లో ఏకకాలంలో నిర్మించారు. వేడుక సందర్భంగా తమిళం, తెలుగు ఆడియోని అక్కడే విడుదల చేశారు. ఇక మహేష్ బాబును చూసేందుకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. అభిమానుల తాకిడితో స్టేడియం మార్మోగిపోయింది. ఈ ఫంక్షన్ కు ఆర్జే బాలాజీ, తమిళ స్టార్ హీరో విశాల్, గాయని చిన్మయి శ్రీపాద, స్టంట్‌ కొరియోగ్రాఫర్‌ పీటర్‌ హెయిన్స్‌, నిర్మాతలు ఎన్వీ ప్రసాద్‌, ఎ.ఎం. రత్నం, నటులు రమేశ్‌ కన్నా, సతీశ్‌ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ మూవీకి హరీష్ జైరాజ్ మ్యూజిక్ అందించారు.ఈ మూవీని సెప్టెంబర్ 27న రిలీజ్ చేయబోతున్నారు.

మహేష్ బాబు మాట్లాడుతూ.. తనకు 18 సంవత్సరాల రీల్ లైఫ్ ఉన్నప్పటికీ ఇప్పుడే కెరీర్ స్టార్ట్ అయినట్లుగా ఉందన్నారు.జస్ట్ ఇప్పుడే సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అవుతున్న ఫీలింగ్ క్రియేట్ అయిందన్నారు. దర్శకుడు మురుగదాస్ తో పనిచేయడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. ఈ మూవీ రూ.120 కోట్ల భారీ బడ్జెట్ మూవీ అని చెప్పారు. ఇంత ఖర్చు చేసిన నిర్మాతలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ మూవీ ప్రేక్షకులను థ్రిల్ కి గురి చేస్తుందన్నారు.తాను పోషించిన క్యారెక్టర్ తన మనసుకు చాలా దగ్గరైన పాత్ర అని అన్నారు. విజయ్ నటించిన ‘తుపాకీ’ మూవీలో ‘ఐ యామ్ వెయిటింగ్’ డైలాగ్ అంటే చాలా ఇష్టమన్నారు. ప్రస్తుతం ‘స్పైడర్’ మూవీతో తమిళ్ లో ఎంట్రీ ఇస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉందన్నారు.

దర్శకుడు మురుగదాస్ మాట్లాడుతూ.. తాను మహేష్ బాబుతో ‘గజనీ’, ‘తుపాకీ’ చిత్రాలను రీమేక్ చేయాలని భావించానన్నారు. కాని వాటికి అవకాశం చిక్కలేదన్నారు. కాని ఇన్నాళ్లకు మహేష్ తో ‘స్పైడర్’ చేసే అవకాశం వచ్చిందన్నారు. 80 రోజుల పాటు రాత్రి పూట షూటింగ్ చేశామన్నారు. ఆ సమయంలో మహేష్ బాబు చాలా చక్కగా సహకరించారని చెప్పారు. వాస్తవానికి మహేష్ లేకపోతే ఇలాంటి ద్విభాషా చిత్రం చేయలేమని అన్నారు. ఈ మూవీలో తన పేరు పక్కన ‘సూపర్ స్టార్’ అని వేయవద్దని మహేష్ కోరారని చెప్పారు. అది ఆయన గొప్పతనానికి నిదర్శనమన్నారు.’ సూపర్ స్టార్ వద్దని .. అభిమానుల ప్రేమ చాలని’ అన్నారని చెప్పారు. విలన్ గా ఎస్ జే సూర్యా చాలా బాగా యాక్ట్ చేశారని ప్రశంసించారు. పీటర్ హెయిన్స్ అందించిన ఫైట్స్ ప్రేక్షకులను అబ్బురపరుస్తాయని చెప్పారు.

ఏఆర్ మురుగదాస్, మహేష్ బాబు ల కాంబినేషన్ లో పనిచేయడం చాలా ఆనందంగా ఉందని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అన్నారు. మహేష్ బాబు చాలా కష్టపడి పనిచేశారని చెప్పారు. ఆయనే మాకందరికి ప్రేరణ అని అన్నారు.’స్పైడర్’ చిత్రంలో పనిచేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఇక తనకు ‘సిసిలియా’ పాట అంటే చాలా ఇష్టమని చెప్పారు.

ఆర్జే బాలాజీ మాట్లాడుతూ.. తాను ఇప్పటివరకు రజనీ, కమల్, విజయ్, అజిత్ లాంటి స్టార్ హీరోలతో నటించలేదన్నారు. కాని స్టార్ హీరో మహేష్ బాబుతో నటించడం ఆనందంగా ఉందన్నారు. మహేష్ చక్కగా తమిళ్ మాట్లాడగలరని అన్నారు. తన అభిమానులు ఎప్పుడు అడిగిన ఫొటోలకు ఆయన వెనుకాడరని అన్నారు. ఇదే మహేష్ గొప్పతనం అని అన్నారు.

Related Posts

leave a comment

Create AccountLog In Your Account